ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలుచేసిన మ్యాండేటరీ (తప్పనిసరి) బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటివరకు ఛార్జిషీట్ నమోదు కానందున వారికి బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వారి వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు.. ఛార్జిషీట్ దాఖలు చేశామని, దాన్ని తిప్పి పంపినంత మాత్రాన అసలు దాఖలు చేయనట్టు కాదు అన్నారు. విచారణ కీలక దశలో ఉందని.. బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. గురువారం ( జులై11) ఇరువైపులా వాదనలు ముగియగా.. జడ్జి ఇవాళ ( జులై 12) తీర్పు వెలువరించారు.
